హనుమకొండ, వెలుగు: వ్యవసాయ బావులు, కాల్వల వద్ద అమర్చిన కరెంట్ మోటార్లను చోరీ చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ సీసీఎస్, కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఏడుగురిని పట్టుకుని వారి నుంచి రూ.6.6 లక్షల విలువైన 71 కరెంట్ మోటార్లు, ఒక ట్రాలీ, ఒక కారు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత గురువారం వరంగల్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన సిరిగిరి ప్రసాద్, మంచిర్యాల సున్నం బట్టి కాలనీకి చెందిన మోతె రాజు, మోటం తిరుపతి, వారణాసి లక్ష్మణ్, మోటం నరేశ్, వస్తం భీమేశ్, గోదావరిఖనికి చెందిన టేకు నవీన్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలించడం ప్రారంభించారు.
కరీంనగర్, రామగుండం, వరంగల్ పరిధిలో
ఈ ముఠా కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లను కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్, దామెర పోలీస్ స్టేషన్ల పరిధిలో 34 మోటార్లు, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కేశవపట్నం, సైదాపూర్, ఇల్లందకుంట ప్రాంతాల్లో 36 మోటార్లు, భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ దొంగిలించారు.
పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో నిందితులు పోలీసులకు చిక్కారు. కేసును ఛేదించిన సీసీఎస్ సీఐలు ఎ.రాఘవేందర్, కె.రామకృష్ణ, కమలాపూర్ సీఐ నవీన్, ఐటీ కోర్ టీమ్ ఏఏవో మొహమ్మద్ సల్మాన్ పాషా, ఎస్సై శ్రీనివాస రాజు తదితర సిబ్బందిని డీసీపీ దారా కవిత అభినందించారు.
